ఫోన్ ట్యాపింగ్ కేసులో రంగంలోకి ఇంటర్పోల్..!!.

ఫోన్ ట్యాపింగ్ కేసులో రంగంలోకి ఇంటర్పోల్..!!.

జనం న్యూస్ 01 నవంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా  ఇన్వెస్టిగేషన్ అధికారుల నుంచి వివరాల సేకరణ
ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు అతి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఇప్పటికే పాస్పోర్టులు జప్తు
హైదరాబాద్‌ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులైన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు, ఓ మీడియా సంస్థ మాజీ ఎండీ శ్రవణ్ రావుపై రెడ్కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియ స్పీడప్ అయింది. మరికొన్ని రోజుల్లో ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంటర్పోల్ సేకరించినట్లు సమాచారం. సీబీఐ సిఫార్సుతో అందిన కేస్ డాక్యుమెంట్ల ఆధారంగా ప్రాసెస్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. తీవ్ర నేరంగా పరిగణిస్తున్న ఇంటర్పోల్ రెడ్‌ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రక్రియలో భాగంగా ఇన్వెస్టిగేషన్‌ అధికారులను ఇంటర్‌పోల్‌ పలు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు నిరూపించే సాంకేతిక ఆధారాలతో పాటు మరికొన్ని అనుమానాలను నివృత్తి చేసుకున్నట్లు తెలిసింది. బ్యూరోక్రాట్స్‌, ప్రభుత్వ, ప్రైవేట్‌ వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఎంత ప్రభావం చూపిందో ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇంటర్పోల్కు వెల్లడించినట్లు తెలిసింది. అమెరికాలో ఉంటూనే.. కేసు వివరాలపై ఆరా అమెరికాలో షెల్టర్ తీసుకున్న ప్రభాకర్ రావు, శ్రవణ్‌ రావు తరుచూ అక్కడ కలుసుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీస్ అధికారుల బెయిల్స్‌, రెడ్‌కార్నర్ నోటీసుల ప్రక్రియను తెలుసుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. వీరిద్దరి పాస్‌పోర్టులు జప్తు, లుకౌట్ సర్క్యులర్స్ జారీ అయిన సంగతి తెలిసిందే. వీటితో పాటు రెడ్‌కార్నర్ నోటీసులు కూడా జారీ అయితే.. పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఏ దేశంలో ఉన్నా సరే.. ఇంటర్‌పోల్ అరెస్ట్ చేసి ఇండియాకు డిపోర్ట్‌ చేస్తది. ఇంటర్‌పోల్ అరెస్ట్‌ చేయడానికి ముందే వాళ్లిద్దరూ ఇండియాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శ్రవణ్‌ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.