50 శాతం జనాభాలోహెచ్ పైలోరీ బ్యాక్టీరియా!.
జనం న్యూస్ 09 నవంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా
అజీర్తి, పొట్టలో పూత, గ్యాస్ సమస్యలకు ఇదే కారణం..????️
1 శాతం మందిలో పొట్ట క్యాన్సర్లకూ దారితీసే ప్రమాదం
నోబెల్ గ్రహీత బ్యారీ మార్షల్ వెల్లడి
ఏఐజీలో తొలిసారి పరిశోధన కేంద్రం ప్రారంభం
????????గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బ్యారీ మార్షల్. చిత్రంలో ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి????
ప్రపంచవ్యాప్తంగా ‘హెలికోబ్యాక్టర్ పైలోరీ(హెచ్ పైలోరీ)’ బ్యాక్టీరియా కేసులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని నోబెల్ బహుమతి గ్రహీత, ఆస్ట్రేలియా వెస్ట్రన్ యూనివర్సిటీ క్లినికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బ్యారీ మార్షల్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచ జనాభాలో సగం మందిలో, భారత్లో 50-60% జనాభాలో ఈ బ్యాక్టీరియా బాధితులున్నారని ఆయన అంచనా వేశారు. జీర్ణాశయం, పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు పొట్ట క్యాన్సర్లకూ ‘హెచ్ పైలోరీ’ బ్యాక్టీరియా కారణం. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో ‘హెచ్ పైలోరీ’ బ్యాక్టీరియాపై పరిశోధనల కోసం తొలిసారిగా ప్రత్యేక కేంద్రాన్ని నెలకొల్పగా.. ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డితో కలిసి బ్యారీ మార్షల్ శుక్రవారం ప్రారంభించారు. దీనికి ‘బ్యారీ మార్షల్ సెంటర్’గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా బ్యారీ మార్షల్ మాట్లాడుతూ.. ‘‘అపరిశుభ్రత, కలుషిత తాగునీరు తదితర కారణాలతో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇంట్లో ఒకరికి సోకితే..మిగతా వారూ దీని బారినపడే ముప్పు ఉంది. ‘హెచ్ పైలోరీ’ సోకినప్పటికీ 80% మందిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కొద్దిమందిలో మాత్రం అజీర్తి, పొట్టలో నొప్పి, గ్యాస్ తదితర ఇబ్బందులుంటాయి. ఒక శాతం మందిలో దీర్ఘకాలంలో ఇది పొట్ట క్యాన్సర్కూ దారి తీస్తుంది. కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారినపడిన చరిత్ర ఉంటే.. మిగతా సభ్యులు వెంటనే ఈ బ్యాక్టీరియా పరీక్షలు చేసుకోవాలి’’ అని సూచించారు. ప్రత్యేక పరిశోధనలు హెచ్ పైలోరీ’పై ప్రత్యేక పరిశోధనల కోసం ప్రొఫెసర్ బ్యారీ మార్షల్ పేరుతో కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామని ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటు.. దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో అద్భుతమైన పురోగతిగా ఆయన అభివర్ణించారు.‘‘ఈ బ్యాక్టీరియాతో దేశ జనాభా పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. ఏఐజీలో ఎప్పటి నుంచో ఈ బ్యాక్టీరియాపై పరిశోధనలు సాగుతున్నాయి. అజీర్తి, వాంతులు, కడుపు నొప్పి తదితర సమస్యలతో వచ్చిన సుమారు 700 మందిని ఇక్కడ పరీక్షించినప్పుడు.. వారిలో 300 మందిలో ‘హెచ్ పైలోరీ’ బ్యాక్టీరియాను గుర్తించాం. ఇది చాలా ఆందోళనకర విషయం. దేశంలో మధుమేహ రోగుల కంటే 10 రెట్లు ఎక్కువగా హెచ్ పైలోరీ కేసులున్నాయి. దీనికి చికిత్స చేయడమే కాకుండా.. ఆరోగ్య సంరక్షణ నమూనాను రూపొందిస్తాం. ఈ బ్యాక్టీరియాను పూర్తిగా పారదోలడానికి ఏఐజీ తన వంతు కృషి చేస్తుంది’’ అని డాక్టర్ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.