*అధికారుల నిర్లక్ష్యం తో రైతుల ధర్నా*
(జనం న్యూస్) సెప్టెంబర్ 26 కల్లూరు మండలం రిపోర్టర్ సురేష్:-మండల పరిధిలోగల బత్తులపల్లి గ్రామంలో ఉన్న లిఫ్ట్ మోటార్లకు ప్రత్యేక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని జల వనరుల శాఖ అధికారులను డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు బత్తులపల్లి లిఫ్ట్ ఆయకట్టు రైతులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా లిఫ్ట్ ఆయకట్టు రైతులు అనిమిరెడ్డి జాస్తి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ గత ఏడు నెలల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో ఉన్న కాపర్ వైరు చోరీకి గురి కావడంతో అప్పటినుంచి నేటి వరకు ఆ ట్రాన్స్ఫార్మర్లు పనిచేయక విద్యుత్ సరఫరా నిలిచిపోయి మోటార్లు పనిచేయకపోవడంతో రైతులకు సాగునీరు అందడం లేదని సంబంధిత అధికారులకు లిఫ్ట్ నిర్వహణపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ జలవనరుల శాఖ సర్కిల్ ఇంజనీర్ పట్టించుకోకుండా జాప్యం చేయడంతో సాగు చేతికి రాకుండా పోయే పరిస్థితి వచ్చిందని వాపోయారు, విద్యుత్ సరఫరాకు 400 కె.వి. సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు అవసరమై ఉండగా అధికారులు 250 కె.వి సామర్థ్యం గల వాటిని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు, అని అన్నారు సామర్థ్యం తగ్గిన ట్రాన్స్ఫార్మర్లవల్ల ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందటం ప్రశ్నార్ధకంగా మారుతుందని వారు వాపోయారు, జల వనరుల శాఖ ఎస్సీ ఈ ఈ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో ఈ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటులో జాప్యం జరుగుతుందని వారు తెలిపారు, మా సమస్య పరిష్కరించమని సంబంధిత అధికారులను కలిసినప్పుడు ఒకరి మీద ఒకరు పొంతనలేని ఆరోపణలు చేసుకుంటూ జాప్యం చేస్తున్నారని అన్నారు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు విషయమై ఎస్సీ ఆనంద్ కుమార్ ఇచ్చిన సమాధానంతో రైతులు ఒకింత అసహనానికి గురయ్యారని ఇకపై జాప్యానికి తావు లేకుండా వెంటనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని వారు ఎస్సీ ఆనంద్ కుమార్ కు వినతిపత్రం అందించారు ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.