|ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు||
విజయనగరం ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు
జనం న్యూస్ 16 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో డిసెంబరు 15న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు పాల్గొని, కీ॥శే॥లు పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించి, మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ - భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి, ప్రాణాలను అర్పించి, అమరజీవిగా నిలిచిన మహానీయుడు శ్రీ పొట్టి శ్రీరాములన్నారు. మహాత్ముడు భోదించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన ఘనత శ్రీరాముల గారిదన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీ వెంట నడిచి, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని,జైలుశిక్ష అనుభవించారన్నారు. కుల, మతాల పట్టింపులు లేకుండా వ్యవహరించి, హరిజనులను దేవాలయంలోకి అనుమతించాలని నిరాహార దీక్ష చేపట్టారన్నారు. శ్రీరాములు నిరాహార దీక్షతో అప్పటి మద్రాసు ప్రభుత్వ హరిజనులను దేవాలయంలోకి అనుమతిస్తూ శాసనాలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాముల త్యాగాలను గుర్తిస్తూ నెల్లూరు జిల్లాకు 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసారన్నారు. అటువంటి మహానీయుడ్ని ఆయన వర్ధంతి రోజున స్మరించుకోవడం, నివాళులు అర్పించడం తెలుగువారిగా మనందరి బాధ్యతని జిల్లా ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐలు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, పి.శ్రీనివాసరావు, ఆర్.ఎస్.ఐలు ఎ.రామకృష్ణ, టి.రామారావు, ముబారక్ అలీ, సి.హెచ్.మహేష్, ఎస్.వి.ఆర్ పాత్రులు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి, పుష్పాలు సమర్పించి, మౌనం పాటించి, ఘనంగా నివాళులు అర్పించారు.