ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై రెడ్ బుక్ అమలు

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై రెడ్ బుక్ అమలు

జనం న్యూస్ 22 సెప్టెంబర్ 2024. జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఆయన చేపల చెరువులు ధ్వంసం..కోర్టులో ఉండగానే చెరువులను ద్వంసం చేసిన రెవెన్యూ- పోలీస్..కాజులూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసిపి నాయకులపై  రెడ్ బుక్ విధానాలు చక చకా అమలు జరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా ప్రతిపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధుల పైన నాయకుల పైన  ముప్పేట దాడులు అమలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల సొంత భూములపై కూడా కారణాలు చూపించి వాటిని ధ్వంసం చేసి స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలో రాజకీయ మేధావులను ఆశ్చర్య చకితుల్ని చేసింది. శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులకు చెందిన కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో చేపల చెరువులను శనివారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. వాస్తవానికి ఈ భూములు తోట త్రిమూర్తులు ఇతర రైతుల వద్ద నుండి కొనుగోలు చేశారు. అయితే ఈ భూములు ల్యాండ్ సీలింగ్, తప్పుడు అభియోగాలు మోపి వాటిని స్వాధీనం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నింది. ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో వైసీపీలోని కీలక నేతలను ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. వీటిలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఒక మాజీ మంత్రి పైన అసత్య ఆరోపణలు చేయించి ఆయన భూములకు ఎసరు పెట్టడానికి కూటమినేతలు తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇదే రీతిలో కొందరి మాజీ మంత్రులపైన రాజకీయంగా ముప్పేట దాడులు జరిగాయి. 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న తోట త్రిమూర్తులను ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హుటా హుటీన కోర్టులో వివాదంలో ఉన్న చేపల చెరువు భూములను ధ్వంసం చేయడానికి జిల్లా కలెక్టరుకు ఆదేశాలిచ్చారు. దాదాపు 200 మంది పోలీసులు శనివారం తెల్లవారుజాము నుండి పల్లిపాలెం గ్రామంలో నాలుగు జేసీబీలతో తోట త్రిమూర్తులకు చెందిన చేపల చెరువులను ధ్వంసం చేశారు. సాధారణంగా భూములను స్వాధీనం చేసుకోవాలన్నా ధ్వంసం చేయాలన్నా యజమానికి నోటీసులు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ అవేమీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి మాటలను జీ హుజూర్ అంటూ యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేసారు. వ్యవసాయ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పుడు గానీ, కోర్టు నుండి సక్రమమైన పద్ధతిలో ఆదేశాలు వచ్చినప్పుడు గానీ భూములపై చర్యలు తీసుకోవడం చట్ట ప్రకారంగా జరుగుతుంది. తోట త్రిమూర్తులు భూములు గత నాలుగు తరాల నుండి జిరాయితీ భూములుగానే ఉన్నాయి. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదం, మిగులు భూములు అని పేర్కొంటూ ప్రభుత్వం ఆఘమేఘాలపై చర్యలకు ఉపక్రమించింది. ల్యాండ్ సీలింగ్ భూములపై ల్యాండ్ ట్రిబ్యునల్ కోర్టులో వివాదం ఇంకా జరుగుతూనే ఉంది. ఇవన్నీ పరిశీలించకుండా యజమానికి తెలియచేయకుండా నోటీసులు ఇవ్వకుండా రాక్షస రాజ్యాన్ని అమలు చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రజాభిమానం కలిగిన తోట త్రిమూర్తులు విషయంలో చంద్రబాబు కక్ష సాధింపు ధోరణి అవలంభించడాన్ని రాజకీయ మేధావులు తప్పు పడుతున్నారు. ఎన్నికల వరకే పోటీ ఉంటుంది తప్ప, మిగిలిన సమయాల్లో రాజకీయ నాయకులపై కక్ష సాధింపు చర్యలు ఎక్కడా కానరావు. చంద్రబాబు రాయలసీమ సంస్కృతిని గోదావరి జిల్లాల్లో ప్రవేశ పెట్టడంపై పలువురు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ప్రజల్లో పరపతి తగ్గించాలని కుటిల యుక్తులు  పన్నడం, వాటిని ఆయన తాబేదారులైన అధికారులు అమలు చేయడం వింతగా ఉంది.