కిడ్నాప్ అయిన 8 మాసాల పసివాడిని తల్లి చెంతకు చేర్చిన పోలీసులు
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 11 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం పట్టణంలో కిడ్నాప్ అయిన 8 మాసాల పసి బిడ్డ ఆచూకీ కనిపెట్టి, గంటల వ్యవధిలోనే కేసు మిస్టరీని చేధించి, బిడ్డను తల్లి చెంతకు విజయనగరం వన్ టౌన్ పోలీసులు చేర్చారని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నవంబరు 10న అన్నారు.
వివరాల్లోకి వెళ్ళితే.. ఒడిస్సా రాష్ట్రం రాయఘడకు చెందిన అశా సాహు తన భర్త, పసి బిడ్డతో కలిసి కూలి పనుల నిమిత్తం విజయనగరం పట్టణం వచ్చి, ఎత్తు బ్రిడ్జి సమీపంలో ఉంటున్నట్లు, నవంబరు 8న మద్యాహ్నం 2 నుండి 3 గంటల సమయంలో నిద్రపోయిన సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, తన ప్రక్కనున్న అభిన సాహు (8 మాసాలు) ను కిడ్నాప్ చేసి తీసుకొని పోయినట్లుగా విశ్వకాంచన అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషనుకు నవంబరు 9న 2 గంటల సమయంలో వచ్చి, ఫిర్యాదు చేసారన్నారు. ఈ ఫిర్యాదుపై విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషను ఎస్ఐ ఎ.నరేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసును తీవ్రమైన చర్యగా భావించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ బాలుడి కిడ్నాప్ కేసును చేధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో సాంకేతికతను వినియోగించి, బాలుడ్ని ఒక మహిళ కిడ్నాప్ చేసినట్లుగా ప్రాధమికంగా గుర్తించాయి. నిందితురాలి ఆచూకీ కనిపెట్టేందుకు విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, వన్ టౌన్ ఇన్చార్జ్ సిఐ ఎల్. అప్పల నాయుడు ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ఆర్టీసి కాంప్లెక్సు, రైల్వే స్టేషను, విజయనగరం పట్టణంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను, పట్టణ శివార్లలోని ప్రాంతాల్లో ముమ్మర గాలింపులు, తనిఖీలు చేపట్టారు. చివరకు మూడు గంటల వ్యవధిలోనే బాలుడ్ని కిడ్నాప్ చేసిన నిందితురాలు దాసన్నపేట, నాగాశపు వీధికి చెందిన కోరాడ సుశీల (24 సం.లు)గా గుర్తించి, అరెస్టు చేసి, ఆమె వద్ద నుండి కిడ్నాప్ అయిన అభిన సాహు (8మాసాలు) ను స్వాధీనం చేసుకొన్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. నవంబరు 10న ఫిర్యాది/తల్లి అయిన ఆశా సాహుకు బాలుడ్ని విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు అప్పగించడంతో కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. నిందితురాలి కోరాడ సుశీలను రిమాండుకు తరలించామన్నారు. ఈ కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే చేధించేటట్లు పర్యవేక్షించిన విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, వన్ టౌన్ ఇన్చార్జ్ సిఐ ఎల్.అప్పల నాయుడు, ఎస్ఐ ఎ.నరేష్, కానిస్టేబుళ్ళు జిన్నం శ్రీను, వెంకట రమణ, ధనలక్ష్మిలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.