తెలంగాణలో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం

తెలంగాణలో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం

జనం న్యూస్ 13 అక్టోబర్ 2024  జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రేవంత్ ప్రభుత్వం మొదట్లో దూకుడు చూపించింది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక వాటిని వెంటనే పూర్తి చేసి ఇక పాలనపై దృష్టి పెట్టాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మానుకున్నారు. ఎంత ఆలస్యం చేస్తే అంత మంచిదని అనుకుటున్నారు. తాజాగా కులగణన తో పాటు ఇతర వ్యవహారాలు ఉండటంతో అవన్నీ పూర్తయిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిసైడయ్యారు. 2019 జనవరిలో గ్రామ పంచాయతీలకు, అదే ఏడాది మే నెలలో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీ కాలం పూర్తి కావడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన తీసుకు వచ్చారు. బీసీ కులగణన కోసం సామాజిక, రాజకీయ, ఆర్ధిక సర్వే కోసం జీవో 18 విడుదల చేశారు. ఈ సర్వే 60 రోజుల పాటు జరుగుతుంది. కుల గణన ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల నిర్వహణపై చర్యలు తీసుకుంటారు. అంటే మరో మూడు , నాలుగు నెలల వరకూ పంచాయతీ ఎన్నికలపై స్పష్టత లేనట్లే. అందుకే ముందస్తుగా గ్రామ పాలనలో కాంగ్రెస్ ముద్ర ఉండేందుకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీల ద్వారానే ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇతర పథకాలకూ ఇందిరమ్మ కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయి. మున్సిపాలిటీలకు మరో ఏడాదికిపైగా గడువు ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే.. అన్నీ ఒక్క సారే నిర్వహించవచ్చు. ఈ ఆలోచన చేస్తే.. మరో ఏడాది వరకూ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవు.