పాపం.. కారుకు సైడ్ ఇవ్వలేదని దారుణంగా యువతిపై దాడి (వీడియో చూడండి)

జనం న్యూస్: మహారాష్ట్రలోని పుణెలో జరిగిన పోర్షే కారు ప్రమాదం ఘటన ఇంకా మరవక ముందే ఆ నగరంలో మరో షాకింగ్‌ ఉదంతం చోటు చేసుకుంది. వాహనం సరిగా నడపాలని సూచించిన ఓ మహిళను కారు యజమాని తీవ్రంగా కొట్టిన ఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. 27 ఏళ్ల ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై బనెర్‌-పాషన్‌ రోడ్డుపై శనివారం మధ్యాహ్నం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కారు యజమానితో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆగ్రహానికి గురైన సదరు వ్యక్తి మహిళపై దాడి చేశాడు. దీంతో ఆమె ముక్కు నుంచి తీవ్రంగా రక్తం కారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఏం జరిగిందో వివరించారు. ''నేను నా ఇద్దరు పిల్లలతో ద్విచక్రవాహనంపై బనెర్‌ వైపు వెళ్తున్నాను. నా ముందు కారులో వెళ్తున్న వ్యక్తి నాకు దారివ్వలేదు. నేను కారు సరిగా నడపాలని సూచించాను. కారు అద్దం కిందకు దించి నన్ను దూషించాడు. తర్వాత నేను ఎలాగోలా ముందుకు వెళ్లిపోయాను. నన్ను వెంబడించిన అతడు బలవంతంగా వాహనం పక్కకు ఆపేలా చేశాడు. కోపంతో బయటకువచ్చి నా జట్టు లాగి ముఖంపై పలుసార్లు కొట్టాడు'' అని వీడియోలో వివరించారు. అందులో ఆమె ముక్కు నుంచి రక్తం కారడం కనిపిస్తోంది. ఈ ఘటన తర్వాత అతడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడని బాధితురాలు తెలిపారు. కారు తాళాలు తీసుకోవడానికి ప్రయత్నించగా.. అందులోనే ఉన్న ఆయన భార్య కూడా తనపై దాడి చేసినట్లు వెల్లడించారు. స్థానికులు కలగజేసుకొని తనని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అనంతరం వాళ్లే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. దాడి చేసిన దంపతులపై కేసు నమోదు చేసినట్లు చతుర్‌శృంగి పోలీసు అధికారి వెల్లడించారు.