మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. మూడు కీలక బిల్లులు..
జనం న్యూస్ 17 డిసెంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం బడ్జెట్ సమావేశాలు మూడో రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. తర్వాత ప్రభుత్వం సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు.. ఈ మూడు బిల్లుల ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ప్రవేశ పెట్టనున్నారు. అలాగే టూరిజం పాలసీపై ఈరోజు లఘు చర్చ జరగనుంది.గరంగరంగా సమావేశాలు..కాగా శాసనసభ శీతాకాల సమావేశాలు గరంగరంగా జరుగుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాయిదాలు, వాకౌట్ల పర్వం నడిచింది. శాసనసభలో ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం’ అని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేయగా.. ‘ఇది ప్రజాప్రభుత్వం’ అని అధికారపక్ష సభ్యులు ప్రతి నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఉదయం సభ వాయిదా పడి తిరిగి మధ్యాహ్నం ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకొని బీఆర్‌ఎస్ నేతలకు సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తామన్నారు. అయినా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తగ్గలేదు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. సభపైనా, స్పీకర్‌పైనా బీఆర్‌ఎస్ నేతలకు గౌరవం లేదా.. అని ప్రశ్నించారు. సభా మర్యాదను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. కాగా, లగచర్ల రైతుల అంశంపై చర్చ జరపాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ దాన్ని తోసిపుచ్చారు. రాష్ట్రంలో సర్పంచులకు బిల్లుల చెల్లింపుపై సభలో దుమారం రేగింది.అది బకాయిల రాష్ట్ర సమితి.. సీతక్కబీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం నాటి బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయని, అది బీఆర్‌ఎస్ కాదని.. ‘బకాయిల రాష్ట్ర సమితి’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. బిల్లులపై మంత్రి సరైన సమాధానం ఇవ్వలేదంటూ బీఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బడా కాంట్రాక్టర్లకు ఒక్క నవంబరు నెలలోనే రూ.1,200 కోట్ల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం.. రూ.లక్షల్లో ఉండే సర్పంచుల బిల్లులను చెల్లించడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. సర్పంచుల పాలిట కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమైందన్నారు. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తుల పెండింగ్ బిల్లులపై మంత్రి సీతక్క సమాధానమిస్తూ ఈ ఏడాది నవంబరు 1 నాటికి సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తం రూ.691.93 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. ఇవన్నీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వ బిల్లులేనని, 2014 నుంచి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయని తెలిపారు. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఒక్క సంతకం చేస్తే ఈ బిల్లుల చెల్లింపు జరిగిపోయేదని, అప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.ఆ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకు రూ.740 కోట్లు, బీఆర్‌ఎస్ హయాంలో పెండింగ్ పెట్టిన ఉపాధి హామీ పథకం బిల్లుల నిధులు రూ.450 కోట్లు కూడా విడుదల చేశామని చెప్పారు. ‘మన ఊరు-మన బడి’ పథకం కింద గత ప్రభుత్వం రూ.1,100 కోట్ల విలువైన పనులు చేయించిందని, ఇందులో రూ.800 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. 15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం నుంచి నిధులు రాలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పెండింగ్ బిల్లుల సొమ్మును చెల్లిస్తామని తెలిపారు. హరీశ్ మాట్లాడుతూ.. బిల్లుల గురించి గవర్నర్‌ను, మంత్రులను కలిసి మొర పెట్టుకుందామని వస్తే అరెస్టులు చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల బిల్లులు విడుదల చేయకుండా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. వీరికి 9 నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కాగా, రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలో 17 వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు...