స్వరాష్ట్ర చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది..
జనం న్యూస్ 17 సెప్టెంబర్ 2023 :- ్పాలమూరు ప్రజల దశాబ్దాల సాగునీటి కష్టాలు తీరాయి. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ పట్టుదల, కార్యదక్షతతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల చిరకాల కల సాకారమైంది. ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది.ముఖ్యమంత్రి బటన్ నొక్కి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. నార్లాపూర్ రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్స్ నుంచి అంజనగిరి రిజర్వాయర్‌లోకి వదిలిన కృష్ణమ్మ జలాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంతరం కొల్లాపూర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రసంగించారు. • మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు• ఒకనాడు పాలమూరు బిడ్డ అంటే హైదరాబాద్లో అడ్డా మీద వలస కూలి. కానీ నేడు పక్క రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించుకొని తమ పొలాల్లో పనిచేసుకుంటున్న రైతు బిడ్డ నేడు నా పాలమూరు వ్యవసాయదారుడు. ఇది మారిన ముఖచిత్రం• తెలంగాణ ఉద్యమంలో నేడు ఇక్కడ పర్యటించినప్పుడు తెలంగాణ వస్తేనే సకల దరిద్రాలు మాయమైతయ్, మన నీళ్ళు మనకు వస్తాయి, మన హక్కులను మనం సాధించుకుంటమని నేను చెప్పాను. దరిమిలా చాలా కష్టపడి మనం తెలంగాణ తెచ్చుకున్నాం.• పాలమూరు ఎంపీగా నేను తెలంగాణ సాధించిన విషయం చరిత్ర. మహబూబ్ నగర్ జిల్లా కీర్తి కిరీటంలో ఇది శాశ్వతంగా నిలిచి ఉంటుంది.• తెలంగాణలో మూడు పెద్ద ప్రాజెక్టులను మొదలుపెట్టుకున్నాం. గోదావరి నది మీద కాళేశ్వరం, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు, పాలమూరులో కృష్ణానది నది పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపట్టినం. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే బ్రహ్మాండంగా తెలంగాణ ఒక వజ్రపు తునక లాగా తయారై, దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతుందని, రైతులు తలెత్తుకొని బ్రతుకుతరు అని ఆలోచించి వీటిని చేపట్టినం. చాలా స్పీడ్ గా ఎన్ని ఆటంకాలు ఎదురైన కాళేశ్వరాన్ని పూర్తి చేసుకున్నాం. సీతారామ ప్రాజెక్టు పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. పాలమూరు పథకం పనులు కూడా దాదాపు మూన్నాలుగు ఏండ్ల కిందటే పూర్తి కావాల్సి ఉండేది. దాన్ని అడ్డుకున్నవారు మరెవరో కాదు ఇదే పాలమూరుకు చెందిన గత్తర బిత్తిర రాజకీయ నాయకులు. తెలంగాణకుండే శత్రువులు ఇక్కడ ఉండే దద్దమ్మ రాజకీయ నాయకులే.• 1975 లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే సమయంలో ఏ ఒక్క తెలంగాణ నాయకుడు కూడా మా మహబూబ్ నగర్ కు నీళ్ళు ఏవి అని అడగలేదు. బచావత్ ట్రిబ్యునల్ జడ్జీలే ఈ ప్రాంతం ఆంధ్రలో కలవకుండా ఉండాల్సిందని, ఈ ప్రాంత నాయకులు ఎవరు తమ వాటా నీళ్ళను అడగటం లేదని, మేమే 17 టిఎంసీలతో జూరాల ప్రాజెక్టును మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టును సాంకేతిక కారణాలు చెప్పి వేరే చోట కట్టవద్దని, మేము సూచించిన చోటే కట్టాలని బచావత్ ట్రిబ్యునల్ రికార్డుల్లో ఉంది.• జూరాల ప్రాజెక్టుకు 1981 దాకా ఎవరూ తట్టెడు మట్టి తీయలేదు. పునాది రాయి వేయలేదు 1981 లో మన తెలంగాణ బిడ్డ అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండి పునాది వేశాడు. అది కూడా నత్త నడకన నడిచి నడిచి ఒక గుంటకు కూడా భూమి ఇవ్వలేదు. • 2001లో గులాబి జెండా ఎగిరిన తర్వాత నేను పాలమూరు కేంద్రంలో పెట్టిన మీటింగ్ లో గర్జించి తెలంగాణ ప్రజల పక్షాన పోరాడాను. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తాబేదార్లు ఉద్యమ దెబ్బకు ముందుకు వచ్చారు. • రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డిఎస్) 1954 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కట్టిన ప్రాజెక్టు. దాన్ని కూడా మొత్తం నాశనం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆలంపూర్ జోగులాంబ గద్వాల అమ్మవారికి దండం పెట్టి అక్కడి నుంచి గద్వాల తేరు మైదానం దాకా నేను చేసిన మొట్టమొదటి పాదయాత్ర విషయం అందరికీ తెలుసు. ఆ సమయంలో ఆంధ్రప్రాంతపు కర్నూలు నాయకులు కేసీఆర్ ఒత్తిడితో రాజోలి బండ తూములు మూసేస్తే మళ్ళీ మేము బాంబులు పెట్టి బద్దలు గొడతాం అని చెప్పారు. ఆ రోజు నేను రాజోలి అనే గ్రామంలో నిద్ర చేసి పొద్దున లేసి కెసి కెనాల్ కు నీరిచ్చే సుంకేశుల బరాజ్ మీదున్నాను. ఆ వార్త పేపర్ లో వచ్చి రక్తం మరిగి మీటింగ్ లో నేను ఒక మాట చెప్పాను.• బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి తూముల మళ్లా బద్దలుకొడతా మాట్లాడితే, అప్పుడే నేను ఏమిరా రాజశేఖర్ రెడ్డి భగవంతుడు నీకు ఏమైనా ఆరు చేతులు ఇచ్చిండా..నీకు రెండే చేతులున్నయ్, మాకు కూడా రెండే చేతులున్నయి. నువ్వు ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టడం కాదు, అక్కడ అడుగు పెట్టినా నేను నిలబడ్డ ఈ సుంకేశుల బరాజ్ వంద బాంబులు పెట్టి పేల్చేస్తా అని చెప్పిన. • ఈ సంఘన తర్వాత నేనే బాధపడ్డ. నేను నా స్థాయికి తగ్గి మాట్లాడిన్నా అని మహబూబ్ నగర్ జిల్లా అంతే ఎంక్వైరీ చేయమని, నేను మాట్లాడింది ప్రజలేమైనా తప్పు తీసుకున్నరా అని విలేఖరులను అడిగిన. వాళ్ళంతా జిల్లా అన్ని మూలలకు ఫోన్ చేసి సాయంత్రం సమాచారం తీసుకుని నాకు చెప్పారు. పాలమూరులో మీరు చెప్పింది ప్రజలు తప్పు తీసుకోలేదు. మాక్కూడ బాంబేసే ఒక మనగాడు పుట్టిండు, ఇప్పుడు పాలమూరుకు నీళ్ళొస్తయ్ అని ప్రజలు సంతోషపడ్డరని నాకు వారు చెప్పారు. • మనం ఏ బాంబేయలే. ఎవర్ని తిట్టలేదు. కొట్టలేదు. ఇంటిదొండలే మనకు ప్రాణగండమైనారు. ఈ జిల్లాలో పుట్టిన దద్దమ్మలు, సన్నాసులే ప్రాజెక్టులను అడ్డుకున్నారు. ఆనాటి ముఖ్యమంత్రులను చూస్తేనే వీళ్ళకు లాగులు తడిచేవి. • మీకెందుకు నోళ్లు లేస్తలేవ్ అని ఇక్కడి నాయకులను అడిగితే, నీళ్ళు కిందికున్నయ్, మనం గడ్డ మీదున్నాం నీళ్ళు ఎట్లొస్తయ్ అని అడిగారు. నీళ్ళు కిందికి లేవు. నీ మెదడు మోకాళ్ళలో ఉన్నదిరా వెధవ అని నేను చెప్పాను.• ఇవ్వాళ పాలమూరు పంపు పొంగు చూస్తే, ఒక నది పారినట్టుగా, కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా మనసు పులకరించే అద్భుతమైన ఘట్టాన్ని నా కండ్లతోని చూసి, నా ఒళ్లంత పులకరించిపోయింది. ఇంతమంచి కార్యక్రమం చేసిన నా జీవితం ధన్యమైంది. • నేను ఈ రోజు ఈ కార్యక్రమానికి వస్తుంటే ఇద్దరో ముగ్గురో బిజెపి పోరగాళ్ళు జెండా పట్టుకొని అడ్డం ఉరికొస్తున్నారు. ఎందుకు... ఏం తప్పు చేసిన నేను... ఇక్కడి బిజెపి నాయకులకు సిగ్గు శరం లజ్జ ఉంటే, ఏమైనీ చీము నెత్తురుంటే, పౌరుషముంటే కృష్ణానది నీళ్ళలో ఎంత వాటా వస్తుందో నరేంద్ర మోడీని తేల్చమనాలి. • విశ్వగురువు అని చెప్పుకునే ప్రధానమంత్రి, మా అంత సిపాయిలు లేరని చెప్పుకునే బిజెపి నాయకులు, పోజులు కొట్టే జిల్లా నాయకులు, కార్యకర్తలు పది సంవత్సరాలనుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదు. కృష్ణా ట్రిబ్యునల్ కు ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్ళు పంచమని ఓ కాగితం రాయాలి. దానికి మోడీ కుయ్ అనడు. బిజెపి నాయకులకు బుద్దుంటే, చీము నెత్తురుంటే ముందు దీన్ని కృష్ణా ట్రిబ్యునల్ కు రిఫర్ చేయించండి. మా నీళ్ళ వాటా ఎందుకియ్యరు అని చెప్పి మేము సుప్రీంకోర్టుకు పోయాం. కేంద్ర ప్రభుత్వం నన్ను పిలిచి మీరు సుప్రీంకోర్టులో కేసు వాపస్ తీసుకొండి, వెంటనే రెఫర్ చేస్తామని చెప్పారు. చెప్పి యేడాదైంది. అతీ గతి లేదు. కానీ సిగ్గులేని బిజెపి నాయకులు మేం తోక తొండం అనుకుంటూ అడ్డంపొడుగు మాట్లాడుతున్నారు.• జరిగిన నష్టం చాలు. జరిగిన మోసం చాలు. • మన సొంత రాష్ట్రమిది. మన హక్కు మనకున్నది. • బిజెపి నాయకులు వస్తే ప్రశ్నించాలి. బిఆర్ఎస్ హక్కులు కోసం పోరాడుతుంటే మీరేం చేస్తున్నరని ఎదిరించాలి.• పళ్ళు పటపట కొరికేది మేము. నా కండ్లలో రక్తం వచ్చేది. • నాటి సమైక్య పాలనలో పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టారు. ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్నా విముక్తి లభించలేదు• తెలంగాణ వచ్చినంక పాలమూరుకు విముక్తి లభించింది. • పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసుకుంటాం.• నెట్టెంపాడు, జూరాల, భీమా ప్రాజెక్టు, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి చేసుకున్నాం. వీటితో 8-10 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తున్నది.• పాలమూరు ప్రాజెక్టు విషయంలో మీ అందరి దయతో, భగవంతుడి ఆశీర్వాదంతో సాధించినం.• కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రకు మేము చెప్పేది ఒక్కటే, మాకు ఎవరి నీళ్ళు అవసరం లేదు. మా వాటా మాకు చెప్తే దాని ప్రకారం బాజాప్తా నీళ్ళు తీసుకుంటాం. మంది సొమ్ము మేం అడుగుతలేం. తెలంగాణ ఆనాడు అడగలేదు. ఈనాడు అడుగుతలేదు. బిజెపి నాయకులకు సిగ్గు, లజ్జ ఉన్నట్లయితే మా పాలమూరు, కృష్ణానది నీళ్ళ వాటాను తేల్చాలని అడగాలి. • చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. • రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, ఇలా చాలా పథకాలను అమలుచేసుకుంటున్నాం.• పెన్షన్లను ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా పెంచుకుంటూ పోతున్నాం• మొట్టమొదట నేను యుద్ధం చేసింది కరెంటు మీద, మంచినీళ్ళ మీద. విజయం సాధించిన.• నల్గొండ జిల్లాలో 4 వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అందుబాటులోకి వస్తే తెలంగాణ సర్ ప్లస్ స్టేట్ గా మారుతుంది. కరెంటు కొరత వచ్చే సమస్యే ఉండదు. • శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకొని మిషన్ భగీరథ పథకం ద్వారా యావత్ తెలంగాణకు నల్లాల ద్వారా మంచినీళ్ళు అందిస్తున్నాం.• మీరు నన్ను విశ్వసించి, నన్ను గెలిపించి ఆశీర్వదించారు. తెలంగాణ బిడ్డలుగా మీ అందరినీ నేను గెలిపించిన. నా ప్రాణాలు అడ్డం పెట్టి, చావు నోట్లో తలపెట్టి, ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణను తెచ్చుకున్నాం. కరెంటు, మంచినీళ్ళు, సాగునీళ్ళు ఒక్కోటిగా పరిష్కారం చేసుకుంటూ, పేదలను, వృద్ధులను కాపాడుకుంటూ ముందుకుపోతున్నాం.• మళ్ళా ఎలక్షన్లు రాంగనే ఆగమాగం గంటలు పట్టుకొని వస్తారు. మేమే అంతా చేసినం. ఆరు చందమామలు పెడతాం. ఏడు సూర్యులు పెడతాం అని వస్తరు. 70 ఏండ్లు ఏడ్చిన పాలమూరును ఆనాడు ఎవడూ పట్టంచుకోలేదు. తెలంగాణను ఊడగొట్టింది ఇదే కాంగ్రెసోడు కాదా. తెలంగాణను ఉద్ధరిస్తా అని చెప్పి దత్తత తీసుకొని ప్రాజెక్టుకు పునాదిరాళ్ళు పాతి, ప్రాజెక్టును పెండింగ్ పెట్టింది తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా...మనం ఏడ్చిన్నాడు మనకు ఎవలైనా సాయం చేసిన్లా...• ఇప్పుడు కొద్ది కొద్దిగా బాగుపడుతున్నాం. మొఖం తెల్లగైతాంది. మళ్లా వీరి చేతిలో మోసపోవద్దు. • మహబూబ్ నగర్ జిల్లాకు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినయ్. • నిన్ననే 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం. సంవత్సరానికి 10 వేల మంది డాక్టర్లను తెలంగాణ రాష్ట్రం తయారుచేస్తుంది. యావత్ భారతదేశంలోని వేరే రాష్ట్రాల్లో జిల్లాకో మెడికల్ కాలేజీ లేదు. కానీ నేడు మనం జిల్లాకో మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం. స్కూల్ ఫీజంత ఫీజు కడితే ఎంబిబిఎస్ చదివే అవకాశం తెలంగాణ కల్పిస్తున్నది. స్కూల్ పిల్లలకు ఉదయం టిఫిన్ పెడితే బాగుంటదని సమాచారం వస్తే మధ్యాహ్న భోజనంతో పాటు, టిఫిన్, కోడిగుడ్డును అందించేందుకు నిన్ననే జీవో ఇచ్చినం. తమిళనాడులో 5వ తరగతి వరకే టిఫిన్ ను అందిస్తుంటే తెలంగాణలో పదవ తరగతి వరకు టిఫిన్ ను అందిస్తున్నాం. • విద్య, వైద్య, విద్యుత్తు, సాగునీటిరంగంలో మనం దూసుకుపోతున్నాం. • నేడు దేశంలోనే జిడిపిలో, తలసరి ఆదాయంలో మనం నెంబర్ వన్ గా పురోగమిస్తున్నాం. ఈ పురోగమనం ఇంతటితో ఆగకూడదు. • మనం దుఃఖపడ్డనాడు మన కష్టాలు తీర్చేందుకు ఎవడూ రాలేదు. ఈ పరిస్థితులను కవి గోరటి వెంకన్న 'వాగు ఎండిపాయెరా ... పెదవాడు ఎండిపాయెరా ' అని తన రాసిన పాటల్లో ఏడ్చిండు.• ఉద్యమ సమయంలో దుందుబి నది దుమ్ము కొట్టుకొని పోతుండేది. దీంట్లో నీరు పారుతున్నదంటే తెలంగాణ తెచ్చుకున్న ఫలితమే. • దొంగ నాయకులతో తస్మాత్ జాగ్రత్త. అలసత్వం వహిస్తే వైకుంఠపాళిలో పెదపాము మింగనట్టైతది. అయ్యిందానికే సంతోషపడుడు కాదు. ఇంకా బ్రహ్మాండంగా బాగుపడాలి. 20 లక్షల ఎకరాల్లో పసిడి పంటలు పండే పాలమూరు జిల్లా కావాలి. అది మన లక్ష్యం. అది సాధించేదాకా మీ దీవెన ఉండాలి. పాలమూరు ప్రాజెక్టుతో నా జన్మ ధన్యమైంది. తెలంగాణ కోసం పార్లమెంటులో బిల్లు పాసైన రోజు నా హృదయం ఎంత పొంగిపోయిందో, ఇవాళ పాలమూరు పంపు ఆన్ చేసిన తర్వాత నా హృదయం అంత పొంగిపోయి, సంతోషం కలిగింది. మనకు కులం లేదు. మతం లేదు. జాతి లేదు. యావత్ తెలంగాణ నాలుగు కోట్ల బిడ్డలు మన బిడ్డలే. ప్రతి ఇంచు మన భూమే. అందరికీ నీళ్ళు రావాలే. అందరూ బాగుపడాలే. మన ఐకమత్యాన్ని కొనసాగించాలి.కొల్లాపూర్ అభివృద్ధికి యువనాయకుడు హర్షవర్ధన్ రెడ్డిగారి కోరిక మేరకు ముఖ్యమంత్రి స్పెషల్ ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నాను. ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీని, రెండు మూడు లిఫ్ట్ లు పెట్టుకోవాలని అడిగారు, వీటిని సర్వే చేయించి మంజూరు చేసి హర్షవర్ధన్ రెడ్డిచేతనో ప్రారంభింపచేస్తాం. బోడగట్టు చెక్ డ్యాం నిర్మాణానికి అవసరమైన 10 కోట్లను మంజూరు చేస్తూ రేపే జీవో కూడా ఇస్తాం. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీకి 15 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నా. మహబూబ్ నగర్ పట్టణంలో జెఎన్ టియు ద్వారా ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తామని ప్రకటిస్తున్నాను. పాలమూరుకు 3 వేల ఇండ్లకు అదనంగా వేయి వేయి ఇండ్లు ఎక్కువగా మంజూరు చేస్తున్నాం. పాలమూరు ఎప్పుడే నా గుండెల్లో ఉంటుంది. జై తెలంగాణ – జై భారత్..ఈ కార్యక్రమంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రొహిబిషన్, ఎక్సైజ్, టూరిజం శాఖామంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, పి.రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు వాణీదేవి, గోరటి వెంకన్న, కసిరెడ్డి నారాయణ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్, డాక్టర్ వి.అబ్రహం, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఎస్.వేణుగోపాల చారి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఈడిగ ఆంజనేయ గౌడ్, మాజీ శాప్ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇంఛార్జి కల్వకుంట్ల వంశీధర్ రావు, రంగారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, ఉన్నతాధికారులు సీఎస్ శాంతి కుమారి, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ రజత్ కుమార్, ఓఎస్డీ టు సీఎం శ్రీధర్ రావు దేశ్ పాండే, డిజిపి అంజనీ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఎత్తిపోతల పథకం సలహాదారుడు కె.పెంటారెడ్డి, చీఫ్ ఇంజనీర్ హమీద్ ఖాన్, చీఫ్ ఇంజనీర్ జీవీ రమణారెడ్డి, కె.ధర్మా తదితరులు పాల్గొన్నారు... జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా