దారుణం.. పెంపుడు కుక్క దాడి.. 1000 కి పైగా కుట్లు 12గంటల ఆపరేషన్..
జనం న్యూస్: పొరుగింట్లో ఉంటోన్న స్నేహితురాలితో ఆడుకోవడానికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారిపై కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి తీవ్రగాయాలపాలైంది. బాలికను బతికించడానికి వైద్యులు దాదాపు 12 గంటల పాటు శ్రమించి వెయ్యికిపైగా కుట్టు వేశారు. దిగ్ర్భాంతికరమైన ఈ సంఘటన అమెరికాలోని చెస్టర్‌విల్లేలో చోటుచేసుకుంది. అమెరికాలోని చెస్టర్‌విల్లేకు చెందిన లిల్లీ నార్టన్ అనే ఆరేళ్ల చిన్నారి ఫిబ్రవరి 18న పొరుగింట్లో ఆడుకోవడానికి వెళ్లింది. ఇంట్లో టేబుల్ వద్ద కార్డ్స్ ఆడుకున్న సమయంలో ఆ కుటుంబం పెంచుకుంటున్న పిట్‌బుల్ జాతికి చెందిన కుక్క ఒక్కసారిగా బాలికపై దాడి చేసింది. కుక్క పంటి గాట్లతో బాలిక ముఖంతా తీవ్రంగా గాయాలయ్యాయి. లిల్లీతోపాటు అక్కడే ఉన్న ఆమె స్నేహితురాలు పెద్దగా అరవడంతో వంట చేస్తున్న తల్లి పరుగున వచ్చి కుక్కను తరిమింది.లిలీ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో చిన్నారిని బోస్టన్ చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్సకు అవసరమైనంత డబ్బుతమవద్దలేకపోవడంతో లిల్లీ కుటుంబ స్నేహితుడు సోషల్ మీడియాలో గోఫండ్‌మీ పేరిట నిధులు సేకరించారు. శనివారం వైద్యులు లిల్లీకి ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్‌లో వెయ్యికి పైగా కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. వారం తర్వాత మరో ఆపరేషన్ చేయవల్సి ఉందని వారు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పట్లో బాలిక మాట్లాడలేదని, నవ్వలేదని, ముఖ కండరాలు తీవ్రంగా గాయపడ్డాయని వైద్యులు తెలిపారు. తన కూతురిని బతికించుకోవడానికి చాలా కష్టపడ్డామని, ఎంతో హుషారుగా ఆడుతూపాడుతూ తిరిగే తన కూతురికి కుక్కలంటే ఎంతో ప్రేమ అని, ఆమె కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని లిల్లీ తల్లి డోరతీ నార్టన్ కన్నీరుపెట్టుకున్నారు.