పాపం.. లిఫ్ట్ ఆట ఆడుతూ లిఫ్ట్ మధ్యలో ఇరుక్కొని నుజ్జు నుజ్జు అయిన పిల్లాడు.. (వీడియో చూడండి)

జనం న్యూస్: సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలోని ధారవి ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానిక కోజీ షెల్టర్ భవనంలోని లిఫ్ట్ వద్ద మహ్మద్ హుజీఫా అనే బాలుడు తన ఏడేళ్ల సోదరి, మూడేళ్ల సోదరుడితో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో లిఫ్ట్‌లో తమ ఫ్లోర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ముగ్గురూ కలిసి లిఫ్ట్‌లోకి వెళ్లి డోరు మూసి, తాము వెళ్లాల్సిన ఫ్లోర్ బటన్ నొక్కారు. ఈ సమయంలో పెద్ద వాళ్లు ఎవరూ లేకపోవడంతో చిన్నారులు లిఫ్ట్ డోరు వద్ద ప్రమాదకర స్థితిలో ఆడుకుంటూ కనిపించారు. తాము దిగాల్సిన ఫ్లోర్ రాగానే ముందుగా ఇద్దరు చిన్నారులు డోరు తీసుకుని వేగంగా బయటికి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ డోరు వేసి వెళ్లారు. హుజీఫా అనే బాలుడు బయటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్ డోరుకు, బయటికి డోరుకు మధ్యలో ఇరుక్కున్నాడు. బయటి డోరు లాక్ అవడంతో తెరవడం అతడి వల్ల సాధ్యం కాలేదు. ఇంతలో లిఫ్ట్ కదలడంతో ఆ చిన్నారి రెండు డోర్ల మధ్య నలిగిపోయాడు. ఈ ఘటనలో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. తర్వాత కొద్దిదూరం పైకి వెళ్లిన లిఫ్ట్ ఆగిపోయింది. ఆ సమయంలో పెద్దవారు ఎవరైనా ఉండుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భావోద్వేగంతో కూడిన కామెంట్లు చేస్తున్నారు. ''అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది''.. అంటూ కొందరు, ''తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది''.. అంటూ మరికొందరు, ''దయచేసి ఎవరూ పిల్లలను ఇలా ఒంటరిగా వదలకండి''.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.