మరణించిన పోలీసు కుటుంబానికి చేయూత' అందజేత
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 05 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేసి, ఇటీవల మరణించిన పోలీసు కానిస్టేబులు కుటుంబానికి “చేయూత”ను అందించేందుకు పోలీసు సిబ్బంది ప్రోగు చేసిన మొత్తాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు డిసెంబరు 4న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవసాత్తు లేదా ఆకస్మికంగా లేదా అనారోగ్యంతో మరణించిన పోలీసు కుటుంబాలు అర్ధంతరంగా తమ కుటుంబ యజమానిని కోల్పోయి, ఆర్థికంగా నష్టపోయిన సమయంలో వారికి ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ అందేంత వరకు వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకొనేందుకు పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, కొంత మొత్తాన్ని ప్రోగు చేసి, వారి కుటుంబాలకు “చేయూత”గా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.జిల్లా పోలీసుశాఖలో విజయనగరం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో కానిస్టేబులుగా పని చేస్తూ, షేక్ బాబా అనారోగ్య కారణాలతో సెప్టెంబరు 24న మరణించగా, వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొనేందుకు 'చేయూత'గా పోలీసు సిబ్బంది ప్రోగు చేసిన రూ.1,47,900/- ల చెక్ ను వారి సతీమణి షేక్ పర్వీన్ నిషా కు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు. ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సకాలంలో కల్పించే విధంగా చర్యలు చేపడతామని, వెంటనే దరఖాస్తు చేయాలని, ఇతర దృవీకరణ పత్రాలను జిల్లా పోలీసు కార్యాలయానికి అందజేయాలని బాబా సతీమణికి జిల్లా ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిపిఓ ఎఓ పి.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ శ్రీ ఎ.ఎస్.వి.ప్రభాకర రావు మరియు పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.