క్రీడా స్ఫూర్తితో సమాజానికి మెరుగైన సేవలందించాలి
-విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి, ఐపిఎస్
జనం న్యూస్ 29 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండు నందు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నవంబరు 28న నిర్వహించిన వార్షిక జిల్లా పోలీసు స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2024 ప్రారంభ వేడుకల్లో విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి, ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై, క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ వార్షిక క్రీడా పోటీలను నవంబరు 28 నుండి 30 వరకు మూడు రోజులపాటు నిర్వహించనుండగా, జిల్లా పోలీసుశాఖకు చెందిన విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి సబ్డివిజన్లు, ఆర్మ్ డ్ రిజర్వు విభాగానికి చెందిన నాలుగు జట్లు వివిధ స్పోర్ట్సు అండ్ గేమ్స్ మీట్లో పోటీ పడి, తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నాయి.ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి, ఐపిఎస్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగులు అన్ని రంగాల్లోను ఇతరులకు రోల్ మోడల్ గా ఉండాలన్నారు. ఉద్యోగరీత్యా పోలీసులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కారణంగా శిక్షణలో ఉన్న శారీరక సామర్థ్యాన్ని కొనసాగించడం కష్టంగా మారుతున్నదన్నారు. కానీ, శారీరక సామర్ధ్యంతోపాటు మానసిక ఆనందం కూడా చాలా అవసరమని, వాటిని మెరుగుపర్చు కోవడానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. పోలీసుల ఆరోగ్యం, మానసిక ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు ఉద్యోగులకు ఎన్ని అత్యవసర విధులు ఉన్నప్పటికీ వార్షిక క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్రీడలు ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచడానికి, కుటుంబ పరిస్థితులను ఒకరితో ఒకరు చెప్పుకోవడంతోపాటు, సమాజంలో క్రొత్తగా జరుగుతున్న నేరాలను నియంత్రించుటకు అవలంభించాల్సిన విధి, విధానాలను, ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంటుందన్నారు. ఈ క్రీడల వలన కలిగిన మానసిక ఉల్లాసంతో తిరిగి ఉత్సాహంతో విధుల్లో నిర్వర్తించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతీ గెలుపు, ఓటముల మధ్య చిన్న వ్యత్యాసం మాత్రమే ఉంటుందని, దాన్ని అధిగమించి, విజయం సాధించేందుకు అవసరమైన స్ఫూర్తిని ఈ క్రీడలతో ఉద్యోగులు పొందాలని, సమాజానికి ఇంకనూ మెరుగైన సేవలను అందించాలని ఉద్యోగులకు విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి పిలుపునిచ్చారుజిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ. - ఈ క్రీడల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదని, ఉద్యోగులందరూ ఒక్కటిగా పని చేయడం, విజయానికి అవసరమైన సహాయ, సహకారాలను ఒకరికొకరు అందించుకొనే క్రీడా స్ఫూర్తి ఉద్యోగుల్లో అవసరమన్నారు. ఓడిపోయే పరిస్థితుల నుండి విజయాన్ని సాధించడానికి ఏవిధంగా ఒడిదుడుకులను ఎదుర్కొనాలి, పని చేయాలన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ క్రీడల ద్వారా తెలుసుకోవాలన్నారు. పోలీసుల విధి నిర్వహణలో శారీరక, మానసిక సామర్ధ్యం చాలా ముఖ్యమని, అందుకు అవసరమైన స్ఫూర్తిని క్రీడలతో పొందాలన్నారు. శారీరక, మానసిక సామర్థాలను మెరుగుపర్చుకోవడానికి కనీసం ఏదో ఒక క్రీడలో ప్రతీ రోజూ పాల్గొనాలన్నారు. మానసిక, శారీరక సామర్ధ్యం కొరకు మన జీవన విధానంలో క్రీడలను ఒక అలవాటుగా మార్చుకోవాలన్నారు. ఈ క్రీడా పోటీల్లో ఉద్యోగులు మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆకాంక్షించారు.31వ వార్షిక క్రీడలను విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి గాలిలోకి బెలూన్లు, కపోతాలను ఎగురవేసి ప్రారంభించారు. అదే విధంగా జిల్లా పోలీసుశాఖకు చెందిన విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి సబ్ డివిజన్లకు, ఆర్మ్డ్ రిజర్వుకు చెందిన నాలుగు జట్లు వివిధ క్రీడాంశాల్లో పోటీపడి, తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నాయి. పురుషుల 400 మీటర్ల పరుగు పందెంను, మహిళల 100 మీటర్ల పరుగు పందెంను విశాఖ రేంజ్ డీఐజి ప్రారంభించి, విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులను, సర్టిఫికేట్స్, మెడల్స్ ప్రధానం చేసారు.క్రీడా పోటీల ప్రారంభ వేడుకల్లో వివిధ పోలీసు జట్లు నిర్వహించిన మార్చ్ పాస్ట్ ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకోగా, ఈ పోటీల్లో క్రీడా స్ఫూర్తితో వ్యవహరిస్తామని, విధులను అంకిత భావంతో నిర్వర్తిస్తామని పోలీను ఉద్యోగులు ప్రతిజ్ఞ చేసారు. ఈ క్రీడా పోటీల ప్రారంభ వేడుకలకు వి.శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ వార్షిక క్రీడా పోటీల ప్రారంభ వేడుకల్లో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావు, విజయనగరం డిఎస్సీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్సీ పి.శ్రీనివాసరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, డిటిసి డిఎస్పీ ఎం.వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, సిఐలు ఎల్.అప్పల నాయుడు, ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, టి. శ్రీనివాసరావు, బి.లక్ష్మణరావు, బి.వెంకటరావు, జి.రామకృష్ణ, వెంకటేశ్వరరావు, ఈ.నర్సింహ మూర్తి, ఆర్ఐలు ఎన్. గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, శ్రీనివాసరావు, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.