గంజాయి వ్యాపారుల నుండి ఆస్తులు కొనుగోలు చెయ్యవద్దు

గంజాయి వ్యాపారుల నుండి ఆస్తులు కొనుగోలు చెయ్యవద్దు

ప్రజలకు విజ్ఞప్తి చేసిన - విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, ఐపిఎస్
జనం న్యూస్ 22 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
గంజాయి వ్యాపారం ద్వారా ఆస్తులు కూడబెట్టిన వ్యక్తుల నుండి ఎవ్వరూ ఆస్తులు కొనుగోలు చేయవద్దని ప్రజలకు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి డిసెంబరు 21న  విజ్ఞప్తి చేసారు. ఇలా అక్రమ వ్యాపారాలతో కూడబెట్టిన ఆస్తులను, వారి నుండి తిరిగి ఎవరైనా కొనుగోలు చేస్తే చట్టపరమైన చిక్కులు తప్పవని హెచ్చరించారు.  ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా, విక్రయం, అమ్మకాలు నిర్వహించి, ఆస్తులు కూడబెడితే వాటిని సీజ్ లేదా జప్తు చేసేందుకు పోలీసుశాఖ చర్యలు చేపడుతుందన్నారు. రేంజ్ పరిధిలో ఇటువంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడిన వ్యక్తులను ఇప్పటికే గుర్తించామని, వారి ఆస్తులను సీజ్ చేసేందుకు చట్టపరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ఏమైనా నూతనంగా ఆస్తులు కొనుగోలు చేసే ముందు సదరు విక్రయదారులు ఆయా ఆస్తులు ఏవిధంగా సంక్రమించాయి, వాటి చట్టపరమైన  స్థితిని ముందుగా ధృవీకరించు కోవాలన్నారు. లేకుంటే.. కొనుగోలుదారులు చట్టపరమైన, ఆర్థికపరమైన సమస్యల్లో చిక్కుకుపోతారన్నారు. అటువంటి ఆస్తులతో కూడిన లావాదేవీలతో కొనుగోలుదారులకు చట్టపరమైన తీవ్ర పరిణామాలు తప్పవని రేంజ్ డీఐజీ ప్రజలకు సూచించారు.ఇదే రకంగా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంకు చెందిన పడాల నాగేశ్వరరావు అనే వ్యక్తి దశాబ్ద కాలంగా గంజాయి వ్యాపారం సాగించి, తన పేరున, భార్య పేరున 15.36 ఎకరాల భూములు కొనుగోలు చేశారని, సదరు భూమి విలువ రూ.62.80 లక్షలు ఉంటుందని విచారణలో వెల్లడైందని అన్నారు. ఈ భూములు ద్వారా వచ్చిన ఆదాయం కూడా అక్రమ సంపాదన గానే గుర్తించడం జరుగుతుందన్నారు. నిందితుడు పడాల నాగేశ్వరరావుకి ఇటీవల ఒక NDPS కేసులో 10 సం.లు కఠిన కారాగార శిక్ష మరియు రూ. లక్ష జరిమాన కూడా న్యాయస్థానం విషించిందని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి తెలిపారు. పడాల నాగేశ్వరరావు ఆస్తులను వేరే వ్యక్తులకు బదిలీ చెయ్యకుండా నిరోధించేందుకు కొత్తకోట సిఐ జి.కోటేశ్వరరావు ఇప్పటికే ఫ్రీజింగ్ ఉత్తర్వులు జారీ చేశారని, సదరు ఆస్తులు చట్టపరమైన పరిశీలనలో డీఐజీ గోపీనాథ్ జట్టి ఒక ప్రకటనలో తెలిపారు.