వైభవంగా రామతీర్థం గిరిప్రదక్షిణ
-జై శ్రీరాం నినాదాలతో మార్మోగిన రామగిరి
-ఉత్తర ద్వార దర్శనాలకు పోటెత్తిన భక్తులు
-శాస్త్రోక్తంగా గోపూజ, మెట్లోత్సవాలు
జనం న్యూస్ 11 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
ప్రసిద్ద పుణ్యక్షేత్రం రామతీర్థంలో ముక్కోటి ఏకాదశి సందర్బంగా నిర్వహించిన గిరిప్రదక్షిణ వైభవంగా జరిగింది. కొండ మెట్ల నుండి ప్రారంభమైన గిరిప్రదక్షిణ, సుమారు పది కిలోమీటర్ల మేర రామనామ స్మరణతో భక్తి పారవస్యం మధ్య ఆద్యంతం సాగింది. సీతారామలక్ష్మణులు ఉత్సవ మూర్తులను ప్రత్యేక పల్లకిలో ఊరేగిస్తూ గిరిప్రదక్షిణ నిర్వహించారు. కోలాటాలు, చెక్క భజనలు, వివిధ రకాల భజనలు వంటి కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాధు పరిషత్ అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి కొండ మెట్ల వద్ద కొబ్బరికాయ కొట్టి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీరాముని స్మరిస్తూ భక్తి గీతాలను, భజన గీతాలను ఆలపిస్తూ భక్తులను ఆధ్యంతం ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, జనసేన నెల్లిమర్ల నియోజకవర్గం నాయకులు లోకం ప్రసాద్, రామతీర్థం సేవా పరిషత్ వ్యవస్థాపకులు జ్యోతిప్రసాద్, ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు పల్లకి వద్ద కొద్దిసేపు భజనలు చేసి భక్తులను అలరించారు. ఈసారి కొత్త రోడ్డు నిర్మాణం జరగడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. పది కిలోమీటర్లు పాటు ఉత్సాహవంతంగా భక్తులు భక్తి పారవస్యం మధ్య ఆధ్యంతం గిరిప్రదక్షిణ నిర్వహించారు.శాస్త్రోక్తంగా గోపూజ అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాలతో పాటు గోపూజ, మెట్లోత్సవం నిర్వహించారు. దేవాలయం ఉత్తర ద్వారంలో భక్తులు దర్శనం కోసం స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకిలో వుంచారు. తర్వాత పల్లకిలో శ్రీ కొదండ రామస్వామి వారి కొండ మెట్లు వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి గోపూజ, మెట్లోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయిరాం ఆచార్యులు, నర్సింహులు వేద మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం భక్తులందరికి అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు.